Uddhav thackeray | కర్ణాటక-మహారాష్ట్రల మధ్య నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ప్రశాంతత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు గార్డియన్గా ఉండాల్సిన కేంద్రం.. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రేక్షక పాత్ర వహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర’ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర ఎగువ సభలో శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రాష్ట్ర శాసన మండలిలో సూచించారు. ఈ సరిహద్దు గ్రామాల్లో తరతరాలుగా మరాఠీ మాట్లాడే ప్రజలు నివాసం ఉంటున్నారని, వారి దైనందిన జీవితం, భాష, జీవనశైలి అంతా మరాఠీ అన్నారు.
ఈ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ‘కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర’ను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఉద్దవ్ ఎత్తిపొడిచారు. ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నదని, స్టాటస్ కో ఆర్డర్లు ఉన్నాయని, అయితే వాతావరణాన్ని చెడగొట్టింది ఎవరు? అని కర్ణాటక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దవ్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని, గార్డియన్గా ఉండటం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.