Maharashtra Assembly Elections : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఆదిత్యా ఠాక్రేతో కలిసి ఢిల్లీలో బుధవారం బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి సంప్రదింపులు జరిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఠాక్రే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీతోనూ సమావేశం కానున్నారు. కాగా, ఢిల్లీలో ఠాక్రే టీఎంసీ, ఆప్, ఎస్పీ నేతలు సహా పలు విపక్ష నేతలతో మంతనాలు జరపనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు, ప్రచారాంశాలపై విపక్ష ఇండియా కూటమి నేతలతో ఆయన చర్చిస్తారు. మరోవైపు పలువురు ఇతర పార్టీలకు చెందిన మహారాష్ట్ర ఎంపీలు సైతం ఠాక్రేను ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మెరుగైన ఫలితాలు సాధించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు.
మరోవైపు, మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముంబైలోని మొత్తం 36 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ ఇటీవల ప్రకటించింది. ముంబైలోని అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయాత్తమయ్యాయని ఆప్ ముంబై చీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విజయవంతంగా నడుపుతున్నదని చెప్పారు. తమకు గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలున్నారని, పార్లమెంట్‌కు గణనీయ సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. పదేండ్లలోనే ఢిల్లీ తరహా అభివృద్ధి మోడల్‌ను ఆప్ దేశానికి పరిచయం చేసిందని చెప్పారు.
Read More :
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది.. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం : పెద్ది సుదర్శన్ రెడ్డి