ముంబై: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థి ముంబై మేయర్ కావాలని ఆకాంక్షించారు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అలెర్ట్ అయ్యారు. గెలిచిన శివసేన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించారు. (Resort Politics In Mumbai) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో 227 వార్డులకు గాను అధికారం కోసం 114 సీట్ల బలం అవసరం. అధికార మహాయుతి కూటిమికి చెందిన బీజేపీ 89 సీట్లు, షిండే వర్గం శివసేన 29 సీట్లు గెలుచుకున్నాయి. అధికారానికి అవసరమైన 114 సభ్యుల కంటే ఈ రెండు పార్టీలకు 118 మంది సభ్యులున్నారు. మహాయుతి కూటమికి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ ఎన్సీపీ బీఎంసీలో మూడు వార్డులు గెలిచింది.
కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 వార్డుల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహా నిర్మాణ సేన (ఎంఎస్ఎన్) 6 వార్డులు గెలుచుకున్నది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఒక వార్డు దక్కించుకున్నది. కాంగ్రెస్ 24 వార్డుల్లో, ఏఐఎంఐఎం ఎనిమిది వార్డుల్లో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు వార్డుల్లో విజయం సాధించాయి. దీంతో ప్రతిపక్షాల బలం 106కు చేరుకున్నది. మెజారిటీ మార్కు అయిన 114కు కేవలం 8 తక్కువ.
మరోవైపు బీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, షిండే వర్గం అధికారాన్ని దుర్వినియోగం చేశాయని, ‘వెన్నుపోటు’ ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ‘కాగితాల మీద శివసేనను అంతం చేశామని వారు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న శివసేనను వారు ఎప్పటికీ నాశనం చేయలేరు’ అని విమర్శించారు. పార్టీ అభ్యర్థిని ముంబై మేయర్‌గా చూడాలన్నది తన కల అని అన్నారు.
కాగా, ఏకీకృత శివసేన బీఎంసీలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నది. తాజా ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే మేయర్ పదవి శివసేనకే దక్కాలని షిండేపై ఒత్తిడి పెరుగుతున్నది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో మేయర్ ఎన్నికలో కింగ్‌మేకర్ అయిన షిండే రిసార్ట్ రాజకీయాలు తెరతీశారు. గెలిచిన పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు.
Also Read:
AIMIM Big Win | మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఏఐఎంఐఎం సత్తా.. 125 స్థానాల్లో గెలుపు
Watch: పేలిన ట్రాన్స్ఫార్మర్.. వ్యక్తికి అంటుకున్న మంటలు