UAE Lift Ban | కొన్ని నెలలుగా భారత్‌తోపాటు పలు దేశాల పౌరుల రాకపై విధించిన ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆదివారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదిత వ్యాక్సిన్లు వేసుకున్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగాండ, సైరా లియోన్, లైబీరియా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. యూఏఈ రెసిడెంట్ వీసా దారులు తిరిగి తమ దేశానికి రావడానికి అనుమతించినట్లు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎంఏ), ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ (ఐసీఏ) తెలిపాయి.
యూఏఈలోని సెవెన్ ఎమిరేట్స్‌లో ఒకటైన దుబాయిలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఎక్స్పో 2020 వరల్డ్ ఫెయిర్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో యూఏఈ కోవిడ్-19 ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ఆంక్షలతో దెబ్బ తిన్న తమ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఈ ఫెయిర్ దోహదపడుతుందని యూఏఈ ఆశాభావంతో ఉంది.
అయితే తమ దేశానికి వచ్చే వారు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ (ఐసీఏ) వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్సీఈఎం, ఐసీఏ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, ప్రయాణానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించాయి. అయితే, 16 ఏండ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపునిచ్చింది.