సిమ్లా: మంచు పర్వతాలపై ట్రక్కింగ్ కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు జారి పడి మరణించారు. అయితే పెంపుడు కుక్క వారి మృతదేహాల వద్ద రెండు రోజులు కాపలా ఉన్నది. (Pet Dog Guards Trekkers Bodies) ఆ కుక్క మొరగడాన్ని గమనించిన రెస్క్యూ సిబ్బంది దాని యజమాని, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా నాలుగేళ్లుగా పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని బిర్ బిల్లింగ్‌లో నివసిస్తున్నాడు.
కాగా, మహారాష్ట్రలోని పూణేకు చెందిన 26 ఏళ్ల ప్రణితా వాలా తన స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బిర్ బిల్లింగ్‌కు వచ్చింది. ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తులు ఒక కారులో సైడ్ సీయింగ్‌కు వెళ్లారు. కారు ముందుకు వెళ్లలేని మార్గానికి చేరుకున్న వారంతా కాలి నడకన ట్రక్కింగ్కు బయలుదేరారు. అయితే వాతావరణం మారడంతో ఒక వ్యక్తి, మహిళ వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు ఆ ప్రాంతం గురించి తనకు బాగా తెలుసని అభినందన్ గుప్తా తెలిపాడు. తన పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్, ప్రణితతో కలిసి ముందుకు వెళ్లాడు. అయితే మంచు వల్ల కొండ అంచుల నుంచి జారి లోయలో పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మరణించారు. వెంట ఉన్న పెంపుడు కుక్క 48 గంటలపాటు వారి మృతదేహాల వద్ద కాపలా ఉన్నది.
కాగా, వెనక్కి తిరిగి వెళ్లిన వారు అభినందన్, ప్రణిత మిస్సింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరి కోసం వెతికేందుకు రెస్క్యూ బృందాలు ఆదివారం రంగంలోకి దిగాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఆ ప్రాంతమంతా వెతికారు. చివరకు కుక్క మొరగడం విని అక్కడకు చేరుకున్నారు. అభినందన్, ప్రణిత మరణించి ఉండటాన్ని గమనించారు. ఇద్దరి మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. అయితే రెండు రోజులుగా ఏ ఆహారం తీసుకోకుండా యజమాని అభినందన్, ప్రణిత మృతదేహాల వద్ద పెంపుడు కుక్క కాపలా ఉండటం, అక్కడి క్రూర మృగాల నుంచి కాపాడటం చూసి రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఆశ్చర్యపోయారు.