కొత్తగూడెం ప్రగతి మైదాన్/సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 22 : మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య సోమవారం జరిగిన భీకర పోరులో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇద్దరూ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇది భద్రతా దళాలకు అతి పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. అలాగే నక్సల్స్‌పై ఇది నిర్ణయాత్మక గెలుపుగా ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రశంసించారు. ఎన్కౌంటర్ వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మడ్ ఇలాకాలోని మూస్ఫర్షి అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కొన్ని గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు గుర్తించారు. తర్వాత మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు.
ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా అలియాస్ వికల్ప్(63) కాగా.. మరొకరు అదే జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా దాదా(67)గా పోలీసులు గుర్తించారు. రామచంద్రారెడ్డి చాలా కాలంగా కేంద్ర కమిటీలో కొనసాగుతుండగా.. సత్యనారాయణరెడ్డి సైతం దండకారణ్యం ప్రత్యేక ప్రాంతీయ కమిటీలో మూడు దశాబ్దాలుగా పనిచేశారు. వీరిద్దరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, అనేక దాడులు, ప్రతి దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ లేఖలు సైతం వికల్ప్ పేరిట విడుదలైన విషయం విదితమే. సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరిపై చెరో రూ.40 లక్షలు చొప్పున మొత్తం రూ.80 లక్షల పైనే రివార్డులు ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి పిన్న వయసులోనే అన్నలతో కలిసి అడవులకు వెళ్లాడు. ఆఖరి సంతానమైన కడారి సత్యనారాయణరెడ్డికి కమ్యూనిస్టు భావాలు ఉండడంతో చదువుకుంటున్న సమయంలోనే అడవి బాట పట్టాడు. పెద్దపల్లిలో జిల్లాలో ఐటీఐ చేస్తున్న సమయంలో ఓ గొడవలో హత్య జరుగగా, తరువాత అజ్ఞాతంలోకి వెళ్లి అన్నలతో కలిసి మావోయిస్టుగా మారాడు. ఇక అప్పటి నుంచి ఇంటి వైపు కూడా చూడలేదు.
గత ఆరు నెలలుగా మావోయిస్టు పార్టీ నాయకత్వానికి, క్యాడర్‌కి పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్రం తలపెట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి దాడుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు మృతిచెందారు. ఆ పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు మొదలుకుని, వివేక్ మాంఝీ(జార్ఖండ్), సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, రఘునాథ్ హేమ్బ్రహ్మ్(జార్ఖండ్), రామ్ఖెల్వాన్(జార్ఖండ్) వంటి నేతలు నేలకొరిగారు