జమ్ము, అక్టోబర్ 16: ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. గురువారం కశ్మీర్లో నార్ ఖాస్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జేసీవో సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మొత్తం 9మంది సైనికులు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు జేసీవోలు ఉన్నారు. పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వారం రోజులుగా ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా, ఉగ్రవాదులు శనివారం కశ్మీర్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్‌కు చెందిన అరవింద్ కుమార్ షా(30) శ్రీనగర్‌లో ఓ ఈద్గా దగ్గర ఉన్నప్పుడు ఉగ్రవాది తుపాకీతో కాల్చాడు. అరవింద్ అక్కడికక్కడే చనిపోయాడు. పుల్వామా జిల్లాలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంఘీర్ అహ్మద్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు.
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తాయిబా కమాండర్ ఉమర్ ముస్తాఖ్ ఖాండే ఉన్నాడు. కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ ట్వీట్ చేస్తూ ‘మన సహచరులైన ఇద్దరు పోలీసులను గతంలో చంపిన ఉగ్రవాది ఉమర్ శనివారం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడితోపాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు’ అని పేర్కొన్నారు.