రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సరిహద్దు భద్రతా దళం (BSF) ప్రత్యేక బృందాలు ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. కొందరు మావోయిస్టులు డీజీఆర్ పెట్రోలింగ్ బృందంపై కాల్పులు జరిపారని అధికారులు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియరాలేదని, సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వివరించారు.