Heart Attack | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) : భారతదేశంలో ఏటా రెండు లక్షల మంది గుండె సంబంధిత జబ్బులతో పుడుతున్నారు. అయితే పుట్టుకతో గుండె జబ్బులు ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా అలాంటి జబ్బులను వెంటనే గుర్తించి పిల్లలకు చికిత్స చేయవచ్చని ఢిల్లీలోని సీకే బిర్లా ఆసుపత్రి కార్డియాలజీ విభాగం కన్సల్టెంట్ సంజీవ్ కుమార్ గుప్తా అన్నారు. అయితే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను గుర్తుపట్టలేనంత లక్షణ రహితంగా ఉంటాయని చెప్పారు.
ఈ గుండె లోపాలు ఊపిరితిత్తుల ద్వారా అసాధారణ రక్త ప్రవాహానికి కారణమవుతాయని, వేగంగా శ్వాస తీసుకోవడం, బరువు పెరగడం, చర్మం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు మాత్రం కనిపిస్తాయని తెలిపారు. ఎదుగుదల లేకపోవడం, తల నొప్పి, గోళ్లు, పెదవులు నీలి రంగులోకి మారడం, ఛాతీ ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఆ రోగికి ఎదురవుతాయని చెప్పారు. వయస్సు పెరిగే కొద్దీ లోపాలు బలపడతాయన్నారు. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, గర్భధారణ సమయంలో రోగనిర్ధారణ చేయకపోవడం, ప్రసూతి అంటువ్యాధులు వీటికి ప్రధాన కారణాలుగా భావిస్తారని డాక్టర్ గుప్తా చెప్పారు.