Fire accident : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఓ కోచింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
ఓల్డ్ రాజేందర్నగర్లోని బడాబజార్ రోడ్డులోని ఓ కోచింగ్ సెంటర్లో ఉదయం 11.08 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారని అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఇదిలావుంటే వెస్ట్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్లో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్లో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులోని ఓ గదిలోంచి మంటలు చెలరేగడంతో ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలోని హోటల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.