పాట్నా: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనా పౌరులను (Chinese nationals) పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని వారిద్దరూ గూఢచర్యం కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉంటారని ఇమిగ్రేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నేపాల్-భారత్ సరిహద్దు ప్రాంతమైన రక్సాల్ మీదుగా దేశంలోకి ప్రవేశించేందుకు ఇద్దరు చైనీయులు శనివారం ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ ఇద్దరిని చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన జావో జింగ్, ఫూ కాంగ్‌గా గుర్తించారు. ఎలాంటి అధికార ప్రతాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన వారిద్దరినీ శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు చంపారన్ జిల్లా ఎస్పీ కంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. అక్రమంగా ఎందుకు ప్రవేశించారన్న దానిపై వారిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు, దేశంలోకి చొరబడిన చైనా జాతీయులు చాలా వింతగా ప్రవర్తించారని, సరైన సమాధానాలు చెప్పడం లేదని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. వారిద్దరిని ఈ నెల 2న కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నాడు వారిని హెచ్చరించి వదిలేసినట్లు వెల్లడించారు. అయితే శనివారం మరోసారి దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి వారు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గూఢచర్యం కోసమేనా అన్న అనుమానాలను తోసిపుచ్చలేమని అన్నారు. గతంలో కూడా చైనా జాతీయులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన సంగతిని అధికారులు గుర్తు చేశారు.