Suicide | ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పున్నియం ఏరియాకు చెందిన బిందు (34) కు 15 ఏళ్ల క్రితం జయకుమార్తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో జయకుమార్ మరణించడంతో ఆమె కొన్ని నెలల క్రితం మరుదంపారై ప్రాంతానికి చెందిన వివన్ను రెండో వివాహం చేసుకుంది.
ఆమెకు వివన్తో ఓ కుమార్తె ఉంది. ఈ స్థితిలో అభిప్రాయ భేదాల కారణంగా రెండో భర్త కూడా విడిపోయారు. తరువాత ఆమె తన కొడుకు, కూతురితో కలిసి పున్నియం ప్రాంతంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడ బిందుకి పక్కింట్లో నివసించే విజితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విజికి భార్య, కాలేజీ చదువుతున్న కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం గురించి విజి భార్యకు తెలియడంతో అభ్యంతరం చెప్పింది.
దాంతో విజి రెండు నెలల క్రితం బిందు, ఆమె ఇద్దరు పిల్లల (5వ తరగతి చదువుతున్న కొడుకు, ఎల్కేజీ చదువుతున్న కూతురు) తో కలిసి బిలాంగ్తోట్టవిలైకి వెళ్లి ఆర్సీ చర్చిరోడ్డులో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దాంతో విజి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి భార్య దగ్గరికి పంపించారు. దాంతో బిందు తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.