హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరాన్లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్ రావు, విశాఖపట్నంకు చెందిన రిటైర్డు బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిద్దరి మృతదేహాలను బుధవారం ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించారు.
చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉండగా.. వారు తిరిగొచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఎమర్జెన్సీ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్లో 9818395787 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.