భోపాల్: ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. (Twin brothers’ robbery trick) చివరకు ఒక చోరీ కేసులో కవల సోదరుల అసలు గుట్టును పోలీసులు రట్టుచేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 23న మౌగంజ్ నగరంలోని లాక్ చేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. లక్షల విలువైన నగలు, నగదు చోరీ అయ్యాయి.
కాగా, ఈ దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సౌరభ్ వర్మతో సహా ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన సౌరభ్ వర్మ పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. కవల సోదరుడైన సంజీవ్ వర్మ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతడ్ని చూసి పోలీసులు గందరగోళానికి గురయ్యారు.
మరోవైపు పోలీసులు దర్యాప్తు చేయగా కవల సోదరుల చోరీల ప్లాన్ బయటపడింది. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వారిద్దరూ ఒకే విధమైన దుస్తులు ధరించేవారు. పక్కా వ్యూహంతో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరు చోరీ చేయగా మరొకరు అదే సమయంలో సీసీటీవీ ప్రాంతంలో ఉండి ఆధారాలు సృష్టించేవాడు. పలు చోరీ కేసుల్లో పోలీసులను కన్ఫ్యూజ్ చేసి తప్పించుకున్నారు.
కాగా, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ అన్నాదమ్ములు విడివిడిగా నివసించేవారు. వారిద్దరూ కవల సోదరులన్న సంగతి చాలా మంది గ్రామస్తులకు కూడా తెలియదు. ఈ ట్విస్ట్ తెలుసుకున్న పోలీసులు కవల సోదరులైన సౌరభ్ వర్మ, సంజీవ్ వర్మను అరెస్ట్ చేశారు. చోరీ చేసిన లక్షలాది విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు.