ద్రవిడ రాజకీయాల తమిళనాట యువటోర్నడో ఆవిర్భవించింది. బెంగాల్లో తుఫాన్ ధాటిని ‘గడ్డిపువ్వు’ తట్టుకోలేకపోయింది. పదేండ్ల తర్వాత కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకొని, పాత ఆనవాయితీకి మళ్లీ ప్రాణంపోసింది. నాలుగు రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. ఓటరు తీర్పునకు ముగ్గురు ముఖ్యమంత్రులు గద్దె దిగారు. అస్సాంలో మూడోసారి బీజేపీ జెండా ఎగురవేయగా, పుదుచ్చేరిలో ఎన్నార్సీ కూటమి మరోసారి గెలుపొందింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాల్లో 107 సీట్లను గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. అధికార డీఎంకే కూటమి 74 స్థానాలకు పరిమితమయ్యింది. పోటీచేసిన రెండు స్థానాల్లో విజయ్ విజయం సాధించగా.. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు.
ఇక, దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కంచుకోటలో బీజేపీ కూటమి తొలిసారిగా పాగా వేసింది. మొత్తం 294 సీట్లలో 208 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకొన్నది. భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమత.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేరళలో లెఫ్ట్ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గండి కొట్టింది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో.. యూడీఎఫ్ కూటమి 89 స్థానాల్లో గెలుపొందగా, ఎల్డీఎఫ్ కూటమి 35 స్థానాలకే పరిమితమయ్యింది. అస్సాం లో బీజేపీ ఘన విజయం సాధించింది. 126 స్థానాల్లో బీజేపీ కూటమి 102 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ కూటమి 21 స్థానాలకు పరిమితమయ్యింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ మార్కును దాటింది.




