Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి రాష్ట్రాన్ని యూపీ, బిహార్ లా మారుస్తోందని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే విమర్శించారు. బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ సేన), శివసేన (యూబీటీ) కలిసి సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేశాయి. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, తన సోదరుడు, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి మహాయుతి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమను ఎవరూ తొలగించలేరనుకుంటే పొరపాటని, మహారాష్ట్రను యూపీ, బిహార్ లా మారుస్తున్నారని రాజ్ థాక్రే అన్నారు. రాష్ట్రం దేశానికే దారి చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల వైఖరిపై థాక్రే సోదరులు మహాయుతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో ఏకగ్రీవంగా ఎన్నికైతే బీజేపీ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టను ఆశ్రయించిందని, మరి బీఎంసీలో కూడా అలాగే చేస్తారా అని వారు ప్రశ్నించారు. ఓట్ల చోరీ తర్వాత అభ్యర్థుల్ని కూడా బీజేపీ ఎత్తుకెళ్తోందని రాజ్ థాక్రే విమర్శించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చోట్ల ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘానికి సత్తా ఉంటే ఏకగ్రీవాలు జరిగిన చోట ఎన్నికను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని థాక్రే కోరారు. ఎక్కువ ఏకగ్రీవాలు చేయించడం ద్వారా జెన్ జి ఓటర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. 20 ఏళ్ల తర్వాత రాజ్ థాక్రే శివసేనతో కలిసి పోటీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, 893 వార్డులు ఉన్నాయి. మొత్తం 2,869 సీట్లున్నాయి. ముంబైలోనే 227 సీట్లున్నాయి.