అయిజ: కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నదిలోకి చేరుతున్నాయి.
ఎగువ వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను మేటెనెన్సు చేసే వేళ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నామన్నారు. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి.
ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.