Tulsi Gabbard : తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న ‘అమెరికాకు తొలి ప్రాధాన్యం’ విధానం కేవలం అమెరికా మాత్రమే ఎదగడానికి కాదని, ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard) వ్యాఖ్యానించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ ‘రైసీనా డైలాగ్’ కార్యక్రమంలో పాల్గొన్న తులసి గబ్బార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహబంధం గురించి కూడా ఆమె ప్రస్తావించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తూ.. ఐక్యత సాధించాలనే తాపత్రయం కలిగిన వ్యక్తని కొనియాడారు. ఆయన లాగానే భారత ప్రధాని మోదీ కూడా శాంతి పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉంటారని పొగిడారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే మోదీ వాషింగ్టన్ పర్యటన చేపట్టడం వారి మధ్య ఉన్న స్నేహబంధంతోపాటు వారి ప్రాధాన్యాలను చాటిచెబుతోందని అన్నారు. ఇరుదేశాల ప్రయోజనాల కోసం ఉత్తమ సేవలు అందించాలని నేతలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారని గబ్బార్డ్ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానంపై గబ్బార్డ్ స్పందించారు. ఆయనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ట్రంప్ విధానాలను కొందరు తప్పుగా ఊహించుకుంటున్నారని అన్నారు. ఆయన ఇతర దేశాలతో ఘర్షణలు పెంచుకోవాలని చూస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదని చెప్పారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఆయన ప్రాధాన్యమిస్తారని తెలిపారు. రైసీనా డైలాగ్ కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన తులసి సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
కాగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి మూడు రోజులపాటు నిర్వహించే 10వ ‘రైసీనా డైలాగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సాన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహాతో పాటు 125 దేశాలకు చెందిన 3,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.