న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. కేంద్రం విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుల మీద బిల్లులను ఆమోదించుకుంటున్నదని, ఇది మంచిపద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు రావడంలేదని, జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం కూనీ అవుతుండటం దురదృష్టకరమన్నారు.
ప్రశ్నించిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించడం అనేది ప్రభుత్వం దేశ ప్రజల గొంతు నొక్కుతుందనడానికి సంకేతమని రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజ్యసభలో 12 మంది ఎంపీల గొంతు నొక్కేశారు, వాళ్లు ఏం తప్పు చేశారు..? అని ఆయన ప్రశ్నించారు. ఆ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు తాము సభలో ఎలాంటి చర్చ జరుగనీయమని హెచ్చరించారు. అదేవిధంగా లఖింపూర్ ఖేరీ ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు.
లఖింపూర్ ఖేరీలో ఓ మంత్రి రైతులను చంపేశాడు. ఈ విషయం ప్రధానమంత్రికి కూడా తెలుసు. కానీ నిందితులపై చర్యలు ఉండవు. ఎందుకంటే దేశంపై అధికారం ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజ్యసభలో ఎంపీల సస్పెండ్ చేసింది ఛైర్మనో, ప్రధానమంత్రో కాదు.. రైతుల ఆదాయం దోచుకోవాలని చూస్తున్న పెట్టుబడిదారులే అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.