న్యూఢిల్లీ, జనవరి 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్ తనను చంపితే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడిని చంపితే భీకర యుద్ధాలు తప్పవని ఇరు దేశాల నాయకులు పరస్పరం హెచ్చరికలు జారీచేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిని అంతం చేస్తామంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలపై ట్రంప్‌ని విలేకరులు ప్రశ్నించగా తనకేమైనా జరిగితే ఇరాన్‌ను భూమి నుంచే పూర్తిగా తుడిచివేయాలని తాను ఇప్పటికే తమ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ట్రంప్ తెలిపారు.
కాగా, ఇరాన్ సుప్రీం నాయకుడు అయా తొల్లా అలీ ఖమేనీకి ఎదురవుతున్న హెచ్చరికలపై ఇరానియన్ జనరల్ అబ్దుల్ ఫజీ షెకార్చీ స్పందిస్తూ తమ నాయకుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ఇరాన్ చూస్తూ ఊరుకోదని ట్రంప్‌కు కూడా తెలుసునని చెప్పారు. తమ నాయకుడిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తే ఆ చేతిని నరికివేయడంతోపాటు ఆ దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తామని, ఇక తాము సురక్షితం అన్న ఆలోచన లేకుండా చేస్తామనిహెచ్చరించారు. ఏడాది క్రితం అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఇటువంటి హెచ్చరికలే జారీచేశారు. అమెరికా జోలికివస్తే అంతు చూస్తామని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు.