Donald Trump | న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు (భారత్) మాతో వ్యాపారం చేస్తున్నారే కాని మేము వారితో వ్యాపారం చేయడం లేదు. అందుకే 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించాం. అయితే రానున్న 24 గంటల్లోగా దీన్ని గణనీయంగా పెంచదలచుకున్నాను. ఎందుకంటే వారు రష్యన్ చమురు కొంటున్నారు. యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు అని మంగళవారం సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. గత వారం భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధించిన తర్వాత భారత్, రష్యాను మృత ఆర్థిక వ్యవస్థలుగా అభివర్ణించి ట్రంప్ తన మాటల దాడిని ఉధృతం చేశారు. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ఈవారం హెచ్చరించారు.
భారత్ కౌంటర్
అయితే ట్రంప్ హెచ్చరికలపై భారత్ స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ప్రత్యేకంగా తమను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అమెరికా, యూరోపియన్ యూనియన్ను భారత్ ప్రశ్నించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఉన్నప్పటికీ అమెరికా, యూరోపియన్ యూనియన్ మాత్రం విస్తృతంగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని భారత్ నిగ్గదీసింది. భారత్‌ను ప్రశ్నిస్తున్న దేశాలే రష్యాతో వాణిజ్యం కొనసాగించడాన్ని భారత్ తప్పుపట్టింది.
భారత్‌కు రష్యా మద్దతు
భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రష్యా మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ భారత్‌పై ఒత్తిడి చేయడాన్ని రష్యా తప్పుపట్టింది. తన సొంత వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్‌కు ఉందని భారత్ వైఖరిని రష్యా సమర్థించింది. ట్రంప్ నుంచి హెచ్చరికలు లాంటి ప్రకటనలు తమ దృష్టికి చాలా వచ్చాయని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మంగళవారం తెలిపారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చట్టవిరుద్ధమైన ప్రకటనలుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
యూఎస్‌తో అణు ఒప్పందం నుంచి తప్పుకున్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించాలంటూ ట్రంప్ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, సరైన కారణాలు లేకుండా తమ దేశ సమీపంలో రెండు అణు జలాంతర్గాముల మోహరింపుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అమెరికాతో 1987లో చేసుకున్న అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును కలిగించాయని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. స్వల్ప, మధ్యస్థ శ్రేణి క్షిపణుల మోహరింపు నిషేధంపై 1987లో చేసుకున్న ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందానికి తాము ఇకముందు కట్టుబడి ఉండబోమని తెలిపింది.