న్యూఢిల్లీ: రష్యాపై వత్తిడి తెచ్చేందుకే ఇండియాపై టారిఫ్ మోత మోగించినట్లు అమెరికా శ్వేతసౌధం(White House) తెలిపింది. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 50 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ రష్యాపై వత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించినట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ పేర్కొన్నారు. రష్యాపై వత్తిడి తేవాలన్న ఉద్దేశంతోనే అదనపు సుంకాలు విధించినట్లు మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఇండియాపై టారిఫ్ విధించారని, ఇతర దేశాలపై కూడా చర్యలు తీసుకున్నారని, ఈ యుద్ధం ఆగిపోవాలని ఆయన క్లియర్‌గా ఉన్నారని ఆమె తెలిపారు.
వీలైనంత త్వరగా శాంతి స్థాపన చేయాలని ట్రంప్ ఆశిస్తున్నారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ లివిట్ తెలిపారు. యురోపియన్ దేశాలు, నాటో జనరల్ సెక్రటరీ కూడా యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పుతిన్, జెలెన్స్కీ మధ్య వీలైనంత త్వరలో చర్చలు ఉంటాయన్నారు.