న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత్‌ను నరకకూపంగా అభివర్ణించారు. వలసదారులు అమెరికాకు విధేయులు కారని, అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జన్మతః పౌరసత్వంపై తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఒక లేఖను ట్రంప్ బుధవారం షేర్ చేశారు. ఇక్కడ పుట్టిన పసికందు తక్షణమే పౌరసత్వం పొందుతుంది. ఆ తర్వాత వాళ్లు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరకప్రాయమైన ప్రదేశం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు. ఇది చూడడానికి మీరు మరీ దూరం వెళ్లనవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న వలసదారుల్లో ఈ దేశం పట్ల ఏమాత్రం విధేయత లేదు. కాని ఒకప్పుడు ఇలా ఉండేది కాదు అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఐరిష్, ఇటాలియన్, పోలిష్, లిథువేనియన్, డొమేనియన్, రష్యన్ వంటి సమూహాలు అమెరికన్ సమాజంలో విజయవంతంగా కలిసిపోయాయని, అయితే సంప్రదాయ మెల్టింగ్ పాట్(వివిధ సంస్కృతుల సమ్మేళనం) ఆశించిన విధంగా పనిచేయడం లేదని లేఖలో పేర్కొన్నారు. తల్లిదండ్రుల నేపథ్యంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ఎవరైనా ఆటోమేటిక్‌గా పౌరులు అవుతారని భావన అయిన జన్మతః పౌరసత్వం అసమంజమైనదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ పౌర హక్కుల సంఘాన్నీ (ఏసీఎల్యూ) ఆయన వదిలిపెట్టలేదు.
మాఫియా కుటుంబాలు అన్నిటినీ కలిసి చేసిన నష్టానికన్నా అధికంగా ఏసీఎల్యూ అమెరికాకు నష్టం చేకూర్చిందని ఆయన ఆరోపించారు. ఆరోగ్య సంరక్షణ వంటి ప్రజాసేవలకు వలసదారులు భారం మోపుతున్నారని, పత్రాలు లేని వ్యక్తుల ఖర్చులను పన్ను చెల్లింపుదారులే భరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. కేవలం మన తీరంలో ఒక పసికందును వదిలి ఆ తర్వాత మొత్తం కుటుంబాన్ని తరలిస్తున్న చైనీయులతో మన దేశం నిండిపోతున్నది. దివాలా తీసిన దేశంలో కనీస ఇంగితజ్ఞానం ఎందుకు లేదు? ఏసీఎల్యూ న్యాయవాది వాంగ్ మన జాతీయ గుర్తింపును నాశనం చేయడానికి, మనల్ని చైనా వలస దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఇది కేవలం చైనాకే పరిమితం కాదు. భారతదేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, చైనాలు ఈ భూమిపై నరకకూపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ట్రంప్ ప్లేటు ఫిరాయించారు. భారత్ చాలా గొప్ప దేశమని, దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తనకు చాలా మంచి స్నేహితుడని ఆయన పొగడ్తలు గుప్పించారు. ట్రంప్ పోస్టు వైరల్ కావడంతో న్యూఢిల్లీలోని అమెరికా ప్రతినిధి క్రిష్టోఫర్ ఎల్మ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. భారత్ గురించి ట్రంప్ సానుకూలంగా మాట్లాడారని, స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అటువంటి వ్యాఖ్యలు సమాచారం లేనివి, అనుచితమైనవని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అమెరికా ఎంబసీ జారీచేసిన వివరణను భారత్ పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనాల మార్పిడిపై ఆధారపడిన ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల వాస్తవ పరిస్థితిని ఇవి ప్రతిబింబించబోవన్నారు.
ట్రంప్ లేఖపై ఇరాన్ కాన్సులేట్ జనరల్ స్పందించారు. చైనా, భారత్ రెండూ నాగరికతకు పుట్టినిల్లు అని ఎక్స్ పోస్టులో ఇరాన్ కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. భారత్, చైనాలను నరక కూపాలుగా ట్రంప్ వర్ణించడాన్ని కాన్సులేట్ జనరల్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన ఓ నరక కూపానికి యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడిగా ట్రంప్‌ను వర్ణించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనముద్రను ఆశ్రయించారు. ట్రంప్ నోటి దురుసుకు తగిన జవాబు ఇవ్వకుండా ఎప్పటిలాగే మొక్కుబడి ప్రకటన చేశారు. ‘ట్రంప్ వ్యాఖ్యలను చూశాం. వాటిని అక్కడితో వదిలేస్తున్నాం’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ విషయంలో మోదీ జీ హుజూర్ అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, భారత్‌పై నోరు పారేసుకోవడం ట్రంప్‌నకు ఇదేమీ కొత్త కాదు. గత ఏడాది.. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణిస్తూ అవహేళన చేశారు. పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసి మాట్లాడారు.