Mumbai terror attacks | ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో (26/11 Mumbai terror Attacks) నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామంటూ ట్రంప్ విలేకరులతో అన్నారు. అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.
64 ఏళ్ల తహవూర్ రాణా (Tahawwur Rana) పాకిస్థాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఇక అతడి అప్పగింత విషయమైన భారత్ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే, రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌పై అమెరికా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అతడి పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాణా అభ్యర్థనను తిరస్కరించింది. అతడిని భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు.
ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాణాను భారత్‌కు అప్పగించే న్యాయ ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో తహవూర్ రాణాను అతి త్వరలోనే భారత్‌కు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read..
Donald Trump | ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. యూ ఆర్ గ్రేట్’.. మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
White House: మోదీ, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్.. జర్నలిస్టును అడ్డుకున్న వైట్‌హౌజ్
Donald Trump | ట్రంప్‌తో మోదీ భేటీ.. మిమ్మల్ని చాలా మిస్సయ్యానన్న అమెరికా అధ్యక్షుడు