వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఆ సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రెస్కాన్ఫరెన్స్ జరుగుతున్న గదిలోకి వెళ్లకుండా వైట్‌హౌజ్(White House) అధికారులు ఏపీ వార్తాసంస్థ జర్నలిస్టును అడ్డుకున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతానికి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని ట్రంప్ నామకరణం చేశారు. దీన్ని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వ్యతిరేకించింది. తమ వార్తల్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని మాత్రమే రాస్తున్నది.
దీంతో ట్రంప్ సర్కారు, ఆ వార్తా సంస్థ మధ్య వైరం ముదిరింది. గత మూడు రోజుల నుంచి అధ్యక్షుడు ట్రంప్ నిర్వహిస్తున్న మీడియా భేటీలకు ఏపీ సంస్థ జర్నలిస్టులకు ఎంట్రీ దక్కడం లేదు. ఇక గురువారం ఇద్దరు ప్రపంచాధినేతలు భేటీ అయ్యారు. మోదీ, ట్రంప్ మీడియా సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టుకు శ్వేతసౌధం రిక్తహస్తాలు చూపించింది. ఇలాంటి విధానాలను ఆపేయాలని ట్రంప్ సర్కారును కోరుతున్నట్లు ఏపీ వార్తా సంస్థ ఓ ప్రకటనలో కోరింది.