న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జరపాలని ఎంపీలు కోరారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును ఇటు స్పీకర్, అటు చైర్మన్ తిరస్కరించారు. దీంతో ఉభయసభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతున్నామని తెలిపారు. కుల గణనపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చాం. దాని మీద చర్చ జరగాలని కోరాం. కానీ తమ నోటీసును తిరస్కరించారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నామని, కేంద్ర మాత్రం మొండికేస్తోందని నామా ధ్వజమెత్తారు. 92 ఏళ్ల క్రితం కుల గణన జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కుల గణన గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
కుల గణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఎంపీ నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వాలని 2014లో తీర్మానం చేసి పంపించామని తెలిపారు. జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానం పంపించామన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తే.. వారికి మద్దతుగా ఉండి, పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కులాల ప్రాతిపదికన బీసీ జనాభా గణన చేపట్టాలి అని కోరుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో #TRS పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు గారు,సహచర ఎంపీలు నామ నాగేశ్వర్ రావు గారు,బిబి పాటిల్ గారు, రాములు గారు,శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. pic.twitter.com/nJPrNu1RXX
— Dr Ranjith Reddy – TRS (@DrRanjithReddy) March 30, 2022