న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సెలబ్రిటీల పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందినవారితోసహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమేగాకుండా ఆయనతో తాము గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. మైమోదీస్టోరీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వీరంతా మోదీకి శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పెయిడ్ పీఆర్(కూలీ తీసుకుని ప్రచారం చేయడం) అంటూ బీజేపీ ఐటీ సెల్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించడమేగాక ఉత్తర కొరియా తరహా బలవంతపు ప్రచారంగా కూడా వారు అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎక్స్‌లో పోస్టు చేసి డిలీట్ చేసిన ట్వీట్‌ని నెటిజన్లు బయటపెడుతున్నారు. మోదీతో కలసి తాను అహ్మదాబాద్‌లో తిన్న భోజనాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ పుట్టినరోజు సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ ఓ ట్వీట్ పెట్టారు.
అందులో పైన విశ్వనాథన్ ఆనంద్జీ అని రాసి ఉంది. తనకు బీజేపీ ఐటీ సెల్ నుంచి ఫార్వర్డ్ అయిన ట్వీట్‌ని యథాతథంగా అట్లాగే తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసిన విశ్వనాథన్ ఆనంద్ జరిగిన పొరపాటుని వెంటనే గుర్తించి ఆ పోస్టును డిలీట్ చేసి విశ్వనాథన్ ఆనంద్ అని సరిచేసి మళ్లీ ట్వీట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. బీజేపీ ఐటీ సెల్ ప్రచార కండూతిని పసిగట్టిన నెటిజన్లు ఎందుకీ కక్కుర్తి అంటూ నిలదీశారు. పనిలోపనిగా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పేందుకు పోటీపడుతున్న సెలబ్రిటీలపై కూడా విమర్శల దాడి చేశారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల గురించి ఏనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించని సెలబ్రిటీలు నేడు నిస్సిగ్గుగా నకిలీ మైమోదీస్టోరీ పేరుతో మోదీకి ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా సిగ్గుచేటైన విషయమని ఓ ఎక్స్ యూజర్ మండిపడ్డాడు.
విశ్వనాథన్ ఆనంద్ పీఆర్ ప్రయత్నం అభాసుపాలు కావడాన్ని మరో నెటిజన్ ప్రస్తావించారు. బీజేపీ ఐటీ సెల్ వాట్సాప్‌లో పంపించిన స్క్రిప్టును విశ్వనాథన్ ఆనంద్ కాపీ చేసి తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారని, అయితే విశ్వనాథన్ ఆనంద్జీని తొలగించడం మరచిపోయారని, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసి జీ లేకుండా రీపోస్టు చేశారని వీణా జైన్ అనే నెటిజన్ పేర్కొన్నారు. మైమోదీస్టోరీ హ్యాష్‌ట్యాగ్‌తో బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న పెయిడ్ పీఆర్‌కు సెలబ్రిటీలు వంతపాడడం పట్ల పార్థ్ ఎంఎన్ అనే మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.