CJI Chandrachud | న్యూఢిల్లీ, మార్చి 17: ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి. అపార అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు. ఉన్నత వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తారని ఆయనకు పేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తండ్రి వైవీ చంద్రచూడ్ చూపిన బాటలో నడిచి అదే అత్యున్నస్థానాన్ని అధిరోహించిన వ్యక్తి డీవై చంద్రచూడ్. స్వతం త్ర భారతావనిలో అదో రికార్డు. రాజ్యంగ బద్ధుడై భారత న్యాయవ్యవస్థను కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న న్యాయాధీశుడిని కూడా ఆన్లైన్ వేధింపులు వెంటాడుతున్నాయి. తరాల తలరాతలను మార్చే తీర్పరికి కూడా ట్రోలింగ్ తప్పడం లేదు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, గవర్నర్ల వ్యవహారశైలిపై ఇటీవల సీజేఐ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. రాజకీయ అల్లరిమూకలు జస్టిస్ చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నాయి. దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని దారుణంగా కించపరుస్తున్న వారంతా అధికార పార్టీ మద్దతుదారులేనని స్పష్టంగా తెలుస్తున్నది. సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ను ట్రోల్ఆర్మీ టార్గెట్ చేయడంపై మేధావులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, సీనియర్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 13 రాజకీయ పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
‘మహారాష్ట్రలో అధికార పార్టీకి మద్దతుదారులుగా ఉన్న కొందరు సీజేఐ చంద్రచూడ్‌పై ఆన్లైన్లో ట్రోల్స్ చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు గర్హనీయం. అసభ్య పదజాలంతో ఆయనపై దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి పోస్టులు లక్షల్లో కనిపిస్తున్నాయి. ఈ ట్రోల్ ఆర్మీపై చర్యలు తీసుకోవాలి’ అని 13 పార్టీల ఎంపీలు, న్యాయవాదులు లేఖలో కోరారు. ఇలాంటి ట్రోల్స్ చేస్తున్న, చేయిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రోల్ ఆర్మీపై చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ వెంకటరమణికి కూడా లేఖ రాశారు. సీజేఐకి ఆన్లైన్ వేధింపులపై పలువురు రాజకీయ నిపుణులు, న్యాయకోవిదులు విస్మయం వ్యక్తం చేశారు.
దేశ ప్రధాన న్యాయమూర్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇది బీజేపీ సోషల్ మీడియా పనేనని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, యావత్తు దేశం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్రపతికి లేఖ రాసిన ఎంపీల్లో కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా, దిగ్విజయ్ సింగ్, శక్తీసింహ్ గోహిల్, ప్రమోద్ తివారీ, అమీ యాజ్ఞిక్, రంజిత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎస్పీ ఎంపీ జయాబచ్చన్, రామ్‌గోపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
శివసేన ఎమ్మెల్యేల మధ్య విభేదాల వల్ల విశ్వాస తీర్మానానికి ఆదేశించిన అప్పటి గవర్నర్ కోశ్యారీ తీరుపై గురువారం సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీల్లో అంతర్గత కలహాలు ఉన్నపుడు గవర్నర్ తన అధికారాలు వినియోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం దిగిపోవటానికి దారితీసే ఎలాంటి చర్యలకైనా గవర్నర్ దిగకూడదని చురకలు అంటించింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే సీజేఐని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి.