Vinay Narwal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వల్కు ఆరు రోజుల క్రితమే వివాహమైంది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ తన భార్య హిమాంషీతో కలసి కశ్మీరుకు హనీమూన్ వచ్చారు. 16న ఈ జంటకు వివాహమైంది. ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన వినయ్ మృతదేహం బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. త్రివర్ణ పతాకం కప్పిన భర్త శవపేటికను పట్టుకుని చూసి ఢిల్లీ విమానాశ్రయంలో విలపించిన హిమాంషీ..
‘నిత్యం మిమల్ని తలచుకుని గర్వపడతాం.. ఈ దేశం మిమల్ని ఎన్నటికీ మరచిపోదు’ అంటూ గద్గదస్వరంతో అన్నారు. ‘ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉన్నా అత్యుత్తమ జీవితాన్ని గడిపారు. ఆయన వల్లనే మేము ఇంకా సజీవంగా ఉన్నాము’ అని హిమాంషీ తెలిపారు. హర్యానాలోని కర్నల్కు చెందిన 26 సంవత్సరాల వినయ్ మృతదేహం బుధవారం సాయంత్రం ఆయన స్వస్థలానికి చేరుకుంది. గురువారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.