రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను 2018కి ముందు 15 ఏండ్ల పాటు పాలించిన బీజేపీ, 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను మోసగించాయని స్థానిక ఆదివాసీ నేతలు చెబుతున్నారు. మావోయిస్టు వ్యతిరేక వ్యూహాల ముసుగులో స్థానిక గిరిజనులపై హింస, కేసులు పెట్టడం, పెద్దయెత్తున సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మైదాన ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్నట్టుగా ఇక్కడ పథకాలు కూడా ఉండవని ఓ రాజకీయ కార్యకర్త పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌తో కాంగ్రెస్ గెలిచింది.
గిరిజన వ్యతిరేక విధానాలతో 2018 ఎన్నికల్లో బస్తర్ రీజియన్‌లోని 12 నియోజకవర్గాలకుగానూ 11 స్థానాల్లో కమలం పార్టీ పరాభవం మూటకట్టుకోగా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఉన్న ఒక్క స్థానంలోనూ ఓటమి చవిచూసింది. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా తమ పట్ల అదే విధంగా వ్యవహరించిందని సర్వ ఆదివాసీ సమాజ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ తమను మోసగించిందని, మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో బీజేపీ సర్కార్ తీసుకొన్నట్టుగానే నిర్ణయాలు తీసుకొన్నదన్నారు.