బెంగుళూరు: కర్నాటక(Karnataka) రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పబ్లిక్ బస్సు సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆందోళన చేయవద్దు అని కోర్టు స్టే ఇచ్చినా ఉద్యోగ సంఘాలు మాత్రం నిరసనలో పాల్గొన్నాయి. జీతాలను సవరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అనేక చోట్ల బస్సులను డిపోల్లోనే పార్క్ చేశారు. కొన్ని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.
సమ్మెలో పాల్గొనేందుకు కొందరు ఉద్యోగులు వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను తరలించేందుకు కొందరు డ్రైవర్లు బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. పరిస్థితిని అధిగమించేందుకు రవాణా సంస్థ ట్రైనీ డ్రైవర్లను రంగంలోకి దించింది. బెంగుళూరు, చిక్కమంగళూరు, రాయ్చుర్, చిత్రదుర్గ్, హుబ్లి, ధర్వాడ్, బెల్గావి, మంగుళూరు, మైసూరు, తుమకూరు, హసన్ మాడికేరి, శివమొగ్గ, కాలబుర్గి పట్టణాల్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు దొరక్క వేల సంఖ్యలో ప్రయాణికులు నిలిపోయారు.
సమ్మె ప్రారంభం కావడానికి ముందు బయలుదేరిన బస్సులు మాత్రమే రోడ్లపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, క్యాబ్ డ్రైవర్లు దండిగా ఆర్జిస్తున్నారు. బెంగులూరులో ఆటో రిక్షాలు ఎక్కువగా వసూల్ చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలు, కర్నాటక ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఎరియర్స్ రూపంలో 38 నెలల జీతాన్ని ఇవ్వాలని, అలాగే 2024 జనవరి ఒకటో తేదీ నుంచి సవరించిన వేతనాన్ని ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.