చెన్నై: ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ వైద్యురాలు, క్యాంపస్‌లోని బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. (Trainee doctor jumps from building) తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరునెల్వేలికి చెందిన 23 ఏళ్ల షెర్లిన్, కాంచీపురంలోని మీనాక్షి మెడికల్ కాలేజీలో ఐదో సంవత్సరం చదువుతున్నది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నది.
కాగా, ఆదివారం రాత్రి మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని బిల్డింగ్ ఐదో అంతస్తులో కిటికీ వద్ద షెర్లిన్ చాలా సేపు కూర్చొవడాన్ని కొంత మంది విద్యార్థులు గమనించారు. అయితే ఆమె ఉన్నట్టుండి బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ట్రైనీ డాక్టర్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం షెర్లిన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లుగా తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు.