శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 10:46:56

240 కి.మీ. నాన్‌స్టాప్‌గా రైలు.. కిడ్నాప‌ర్ అరెస్ట్

240 కి.మీ. నాన్‌స్టాప్‌గా రైలు.. కిడ్నాప‌ర్ అరెస్ట్

ల‌క్నో : మూడేళ్ల బిడ్డ‌ను కిడ్నాప‌ర్ నుంచి కాపాడేందుకు ఓ రైలు ఏకంగా 240 కిలోమీట‌ర్లు నాన్‌స్టాప్‌గా ప్ర‌యాణించింది. కిడ్నాప‌ర్‌ను అదుపులోకి తీసుకుని బిడ్డ‌ను త‌ల్లికి అప్ప‌గించారు రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసులు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌లిత్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ల‌లిత్‌పూర్‌కు చెందిన ఇద్ద‌రు దంప‌తుల‌కు మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌రుచూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఈ క్ర‌మంలో సోమ‌వారం భార్య వ‌ద్ద గొడ‌వ పెటుకున్న భ‌ర్త‌.. మూడేళ్ల కుమార్తెను తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత ఎటు వెళ్లిపోయాడో తెలియ‌లేదు. బిడ్డ‌ను ఎత్తుకుని ఓ వ్య‌క్తి రాప్తిసాగ‌ర్ సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన‌ట్లు త‌ల్లికి స‌మాచారం అందింది. దీంతో బాధిత త‌ల్లి ల‌లిత్‌పూర్ రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ‌పోలీసులు స్టేష‌న్‌లోని సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా.. రాప్తి సాగ‌ర్ ఎక్స్‌ప్రెస్‌లో బిడ్డ‌ను ఎత్తుకుని ఎక్కిన దృశ్యాలు వెలుగు చూశాయి. ఈ క్ర‌మంలో ఆర్పీఎఫ్ పోలీసులు భోపాల్ రైల్వే పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. రైలు మ‌ధ్య‌లో ఆపితే ఆ కిడ్నాప‌ర్ దిగిపోయే అవ‌కాశం ఉంద‌ని భావించి.. ల‌లిత్‌పూర్ నుంచి భోపాల్(240 కిలోమీట‌ర్ల దూరం) ఆప‌కుండా రైలును న‌డిపారు. భోపాల్‌కు రైలు చేరుకోగానే.. పోలీసులు అన్ని డ‌బ్బాల‌ను చుట్టుముట్టి కిడ్నాప‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల బిడ్డ‌ను కిడ్నాప్ చేసింది తండ్రేన‌ని తేలింది. అత‌న్ని ల‌లిత్‌పూర్‌కు తీసుకువ‌చ్చి.. భార్యాభ‌ర్త‌ల‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు పంపించారు.