Karnataka | బెంగళూరు, జూలై 8: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యలను తేలిగ్గా తీసుకుంటున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అన్నదాతల ఆత్మహత్యలపై కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరున మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నాయి. నష్ట పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక మంత్రి అంటే, అసలు రైతు ఆత్మహత్యలే జరగడం లేదని మరో మంత్రి ఇటీవల వ్యాఖ్యానించడం పట్ల దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయం తాజాగా రెవెన్యూ శాఖకు చెందిన ఒక దస్త్రంలో బయటకు వచ్చింది. గత 15 నెలల కాలంలో రాష్ట్రంలో 1,182 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.
ఒక్క జిల్లాలోనే 122 మంది
రాష్ట్రంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలకు తీవ్ర కరువు పరిస్థితులు, పంట నష్టం, అప్పుల భారమే కారణమని రెవెన్యూ శాఖ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఎక్కువగా బెళగావి జిల్లాలో 122 మంది, హవేరిలో 120 మంది, ధార్వాడ్లో 101 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిక్మగళూరులో 89 మంది, కలబుర్గిలో 69 మంది, యాదగిరిలో 68 మంది రైతులు బలవంతంగా తనువు చాలించారు. 27 జిల్లాలతో కూడిన కర్ణాటకలో కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే 10 మంది లోపు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 21 జిల్లాల్లో 30 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
పరిహారం పెంచాకే ఆత్మహత్యలు పెరిగాయి: మంత్రి పాటిల్
రైతుల ఆత్మహత్యల అంశాన్ని రైతు సంఘాలు, విపక్ష పార్టీలు లేవనెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలపై మంత్రుల స్పందన తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. గత సెప్టెంబరులో చెరుకు అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల మంత్రి శివానంద్ పాటిల్ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ… ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పేర్కొనడం వివాదాస్పదమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
‘ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి. సొంత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వారిని రైతులు అంటామా?’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ శాఖ దస్త్రం ప్రకారమే 15 నెలల్లో 1,182 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని తేలడంతో రాష్ట్రంలో రైతుల దయనీయ స్థితి స్పష్టమవుతున్నదని విపక్షాలు పేర్కొంటున్నాయి.