బుధవారం 20 జనవరి 2021
National - Dec 28, 2020 , 17:51:16

లైంగిక ఉద్దేశం లేని స్పర్శ.. లైంగిక వేధింపు కాదు

లైంగిక ఉద్దేశం లేని స్పర్శ.. లైంగిక వేధింపు కాదు

ముంబై: లైంగిక ఉద్దేశం లేని స్పర్శ.. లైంగిక వేధింపు కాదని, ఇది పోక్సో చట్టం కిందకు రాదని బాంబే హైకోర్టు తెలిపింది. మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేసింది. బారామతికి చెందిన 27 ఏండ్ల వ్యక్తి పొరుగున ఉన్న 17 ఏండ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. ఒక రోజు ఆమె ట్యూషన్‌కు వెళ్తుండగా అడ్డుకుని చేయి పట్టుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. భయపడిన ఆమె అందుకు నిరాకరించి అతడి నుంచి విడిపించుకుని వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. మొబైల్‌ నుంచి బెదిరింపు మెసేజ్‌లు పంపాడు. 

అంతేగాక ఆ బాలికకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి కొందరు స్నేహితులతో అతడు చాట్‌ చేశాడు. ప్రతి రోజు ఆమె ఇంటి వద్ద నిలబడి ఫోన్‌ మెసేజ్‌లు పంపేవాడు. బాలిక తండ్రికి ఈ విషయం తెలిసి మందలించగా దూరంగా ఉంటానని చెప్పాడు. అయితే మళ్లీ అదే పని చేయడంతోపాటు ఆమె తండ్రిని కూడా బెదిరించాడు. ఇలా ఎనిమిది నెలలపాటు సాగిన అనంతరం చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్లతోపాటు బాలిక మైనర్‌ కావడంతో పోక్సో చట్టంలోని లైంగిక దాడి, స్పర్శకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు. 

ఇందులో రెండు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు కావడంతో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ను దిగువ కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుడు లైంగిక ఉద్దేశంతోకాక ప్రేమను వ్యక్తం చేసేందుకు ఆమె చేతిని పట్టుకున్నాడని, పోక్సో సెక్షన్‌ 8కి సంబంధించిన లైంగిక వేధింపు కాదని అతడి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ భారతి డాంగ్రే అతడికి బెయిల్‌ మంజూరు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo