Electrocution : ఓ పెళ్లి ఊరేగింపు (Wedding procession) నిరుపేద విద్యార్థి (Poor student) ప్రాణాలు తీసింది. ఊరేగింపులో కరెన్సీ నోట్లు (Currency notes) వెదజల్లడంతో ఆ నోట్లు ఏరుకోబోయిన బాలుడు విద్యుత్ షాక్ (Electrocution) కు గురై ప్రాణాలు కోల్పోయాడు. హర్యానా రాష్ట్రం (Haryana State) లోని సోనిపట్ జిల్లా (Sonipat district) లో ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. సోనిపట్ జిల్లాలోని రోహతక్ పట్టణం నుంచి సమీపంలోని తాజ్పూర్ గ్రామం వరకు గురువారం రాత్రి ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు తాజ్‌పూర్‌లోని ఫామ్ హౌజ్‌కు చేరుకోగానే పెళ్లివాళ్లు గాల్లోకి కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఆ నోట్లను ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు కూడా కరెన్సీ నోట్ల కోసం పోటీ పడ్డాడు. ఫామ్ హౌస్ పైన పడిన నోట్ల కోసం పైకి వెళ్లి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
అందరూ చూస్తుండగానే బాలుడు మంటల్లో కాలిపోయాడు. బాలుడు తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ విషాద ఘటనతో అప్పటిదాకా డ్యాన్సులతో దద్ధరిల్లిన ఊరేగింపులో నిశ్శబ్దం చోటుచేసుకుంది. బాలుడు తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.