న్యూఢిల్లీ, మే 23: పుల్వామా ఉగ్ర దాడి సూత్రధారి, హిజ్బుల్ చీఫ్ హమ్జా బుర్హాన్ అంత్యక్రియలకు వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్ర నేతలు తుపాకులు చేత పట్టుకొని హాజరయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో హమ్జా బుర్హాన్ అలియాస్ అర్జుమంద్ గుల్జార్ దర్ ఇటీవల హతమయ్యాడు.
ఇస్లామాబాద్‌లో శుక్రవారం అతడి అంత్యక్రియలు జరిగాయి. వీటికి హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్-బదర్ అధినేత భక్త్ జమీన్ఖాన్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు, ఇతర ఉగ్ర సంస్థలకు చెందిన చోటామోటా నాయకులు హాజరైనట్టు స్థానికులు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలను బట్టి తెలుస్తున్నది.
భక్త్ జమీన్‌కు రక్షణగా ఆయన చుట్టూ సాయుధులైన సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. ఈ అంతిమ యాత్రపై కూడా దాడులు జరిగే అవకాశమున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులను కూడా భారీగా మోహరించారు.