న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష పదవిలో నియమితులయ్యే నేత పేరు ప్రకటనను వాయిదా వేయాలని ఆ పార్టీ అగ్ర నేతలు నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత, బీహార్ శాసన సభ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడవచ్చు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబరులో జరుగుతాయి. ఆ తర్వాతే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీలోని అత్యున్నత స్థాయి వర్గాలు చెప్పినట్లు మీడియా పేర్కొంది. సమాంతర అధికార కేంద్రాలు ఏర్పడటాన్ని నిరోధించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.