Tomato | ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి కీలక వివరాలను వెల్లడించారు. భారీ వర్షాలు తదితర ఆటంకాలు లేకపోతే రాబోయే వారంలోగా ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో టమాట ధర రిటైల్ మార్కెట్లో కిలో రూ.75కి తగ్గింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 12న ఢిల్లీలో టమాటా రిటైల్ ధర కిలో రూ.75 ఉండగా.. ఏడాది కింద ఇదే కాలంలో కిలో ధర రూ.150గా ఉన్నది. సరఫరాలో అంతరాయంతో పెరిగిన టమాటా, ఉల్లి ధరలు త్వరలో స్థిరపడే అవకాశం ఉందని అధికారి పేర్కొన్నారు.
టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు, ఢిల్లీ సహా పలు నగరాల్లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండ వేడిమి, ఆ తర్వాత కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడి ధరలు పెరిగాయి. జూలై 12న సగటున రిటైల్ టమాటా ధర కిలో రూ.65.21 ఉండగా, గతేడాది కిలో రూ.53.36గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా అవుతోంది. ఢిల్లీలో బంగాళాదుంపల రిటైల్ ధర కిలో రూ. 40 ఉండగా, గతేడాది ఈ సమయంలో కిలో రూ.25గా ఉంది. అదే సమయంలో కిలో ఉల్లి ధర రూ.57 ఉండగా, గతేడాది కిలో రూ.33గా ఉన్నది. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.