హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బీజేపీకే సాధ్యం అన్నట్టు కనిపిస్తున్నది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతో ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఓ ఐఏఎఫ్ విమానం చేరుకొన్నది. ఫ్లైట్‌లోకి ఎక్కిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ క్రమంలో ‘ప్రధాని మోదీ దయతో మీ ప్రాణాలు దక్కాయి. అంతా బాగానే ఉంటుంది. భారత్ మాతాకీ జై, మోదీకీ జిందాబాద్’ అని అన్న ఆయన.. ‘మీరు కూడా జిందాబాద్‌లు కొట్టండి’ అంటూ విద్యార్థులను బలవంతపెట్టారు. అయితే, ‘భారత్ మాతాకీ జై’ అన్న విద్యార్థులు ‘మోదీకీ జిందాబాద్’ అంటూ నినదించలేదు. అయితే మంత్రి మాత్రం ఊరుకోలేదు. జై కొట్టాలని.. మరోసారి అడిగారు. దీంతో చేసేదేమీలేక.. కొద్దిమంది మాత్రమే చిన్నగా ‘మోదీకీ జిందాబాద్’ అని అయిష్టంగానే అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్టు స్వాతి చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ తీరు సిగ్గుచేటు అని విమర్శించారు.
‘మోదీకీ జిందాబాద్’ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘జీవన్ బచ్ గయా హై మోడీజీ కి కృపా సే!!! తీవ్ర బాధలో, అలసిపోయిన విద్యార్థులతో ఇలా స్లోగన్స్ చేయించి పబ్లిసిటీ చేయడం ఎంత భయంకరం. ఇది అర్థంలేని పని’ అంటూ వీడియోలోని సారాంశాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు.