హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ప్రజలు, రైతులకు సవాల్‌గా మారుతున్నాయి. అకాల, భారీ వర్షాలు సైతం పంటలను దెబ్బతీస్తూ రైతులకు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు పిడుగులు పడి ఏటా ప్రజల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో ఏయే ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఎకడ ఉంది.. తదితర సమాచారాన్ని ప్రజలు, రైతులు సులువుగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దామిని, రెయిన్అలారమ్, మేఘ్‌దూత్, కిసాన్సువిధ వంటి ప్రత్యేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ యాప్‌లతో వాతావరణ పరిస్థితులను సులభంగా తెలుసుకోవచ్చని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్‌ల్లో వాతావరణ పరిస్థితులతోపాటు పంటలకు మార్కెట్ ధరలు, బీమా సదుపాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు హెచ్చరికలు, నీటి నిర్వహణ, విత్తనాలు, ఎరువుల సమాచారం కూడా లభిస్తుందని పేర్కొంటున్నారు.