న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల వాదనకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. (Court Cases Cost) 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యాజ్యాల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్కువ. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2014-15లో వ్యాజ్యాల కోసం రూ.26.64 కోట్లు, 2015-16లో రూ.37.43 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. 2014-15 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య గత పదేళ్లలో కోర్టుల్లో వ్యాజ్యాల కోసం రూ. 409 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కాగా, దేశంలోని పలు కోర్టుల్లో పెండింగ్ ఉన్న సుమారు ఏడు లక్షల కేసుల్లో కేంద్రం ఒక పార్టీగా ఉందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఇటీవల రాజ్యసభకు తెలియజేశారు. సుమారు రెండు లక్షల కేసుల వ్యాజ్యాల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే లిటిగెంట్గా ఉందని చెప్పారు. లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ బ్రీఫింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు.
మరోవైపు పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించే జాతీయ వ్యాజ్య విధానంపై ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మార్పులు చేర్పులతో పెండింగ్లో ఉన్న ప్రతిపాదిత ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గం త్వరంలో తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.