West Bengal : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి షాక్ తగిలింది. 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రితబ్రతా బెనర్జీని తమ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు విజ్ఞప్తి చేశారు.
బుధవారం వీరంతా ప్రత్యేక బస్సుల్లో బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రితబ్రతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. టీఎంసీలో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 58 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతగా రితబ్రత పేరు సూచిస్తూ మద్దతు నిలిచారు. ఆయన చెప్పినట్లు పార్టీపై 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మమత పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు మమతా బెనర్జీకానీ, టీఎంసీ అగ్రనాయకత్వం కానీ స్పందించలేదు. మరోవైపు టీఎంసీ అగ్రనేత అభిషేక్ కల్యాణ్ బెనర్జీ తాజాగా ఎక్స్‌లో స్పందించారు. తన పార్టీ తరఫున అసెంబ్లీలో హోదాలకు సంబంధించి కీలక ప్రతిపాదనల్ని స్పీకర్‌కు పంపించారు.
ఆయన ప్రకారం.. శోభన్‌దేవ్ ఛట్టోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు. కానీ, ఇప్పుడు అత్యధిక శాతం ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు పలకడంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రితబ్రతనే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే మమత ఆధ్వర్యంలోని టీంఎసీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఇటీవలే రితబ్రతతోపాటు సందీపన్ సాహాను కూడా టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అగ్రనాయకత్వం తమ సంతకాలను ఫోర్జరీ చేసిందని వీరు ఫిర్యాదు చేయడంతో టీఎంసీ వీరిని సస్పెండ్ చేసింది.