Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో పదిహేనేళ్లపాటు ఎదురే లేకుండా అధికారం చెలాయించిన టీఎంసీకి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఒక్క ఓటమి పార్టీ రాజకీయ భవిష్యత్‌నే మార్చేయబోతుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీఎంసీ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ బహిరంగంగా బీజేపీకి మద్దతు పలికారు. అంతేకాదు.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన 100 మంది కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేశారు.
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే టీఎంసీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా టీఎంసీని వీడే అవకాశాలున్నట్లు చెప్పారు. ఆయన టీఎంసీకి రాజీనామా చేస్తే.. రాజధాని కోల్‌కతాలో టీఎంసీకి భారీ నష్టమే జరుగుతుంది. తాజాగా ఫాల్టా నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్‌లో టీఎంసీ అభ్యర్థి.. ఎన్నికకు ముందే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. పార్టీని వీడొద్దని కౌన్సిలర్లకు మమత విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ ఆమె మాటకు విలువ ఇవ్వడం లేదు.
టీఎంసీకి రాజీనామా చేసిన చాలా మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుంది. మరోవైపు టీఎంసీ భారీగా పతనమవుతుంది. ఈ పరిస్థితిని మమత ముందే ఊహించారేమో.. ఇటీవల ఆమె మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లేవాళ్లంతా వెళ్లిపోవచ్చు అంటూ చెప్పారు. టీఎంసీ హయాంలో మున్సిపాలిటీలలో జరిగిన అవినీతిపై బీజేపీ దృష్టి సారించింది. పలు అవినీతి ఆరోపణలున్న కౌన్సిలర్లను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయిస్తోంది. ఇటీవలే ముగ్గురు టీఎంసీ కౌన్సిలర్లను ప్రభుత్వం అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇది టీఎంసీ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ నాయకురాలైన మమతా బెనర్జీ ఆ పార్టీని వీడి 1998లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని స్తాపించారు. ఆ తర్వాత వివిధ పోరాటాల ద్వారా 2011లో తొలిసారిగా అధికారం చేపట్టారు. అప్పటినుంచి 2026 వరకు వరుసగా మూడుసార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది పార్టీ.