కోల్‌కతా : నరేంద్ర మోదీ సర్కార్‌పై సమైక్య పోరుతో ముందుకెళతామని చెబుతూ చేతులు కలిపిన మమతా బెనర్జీ-సోనియా గాంధీల స్నేహం మూణ్ణాళ్ల ముచ్చటగా మారినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే దేశంలో కాషాయ పార్టీ వేళ్లూనుకుందని దీదీ సారధ్యంలోని టీఎంసీ విరుచుకుపడింది. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి టీఎంసీ సహా ఇతర పార్టీల్లో చేరుతున్న నేపధ్యంలో టీఎంసీ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పట్ల విసుగు చెందిన ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారని పార్టీ పత్రిక జాగో బంగ్లా సంపాదకీయంలో టీఎంసీ రాసుకొచ్చింది. ఓటర్లు కాంగ్రెస్ నాయకత్వం పట్ల ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదని అందుకే ప్రతిరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని ఆరోపించింది. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన విపక్షాన్ని టీఎంసీ కోరుకుంటోందని, గోవాలో ఈ దిశగా కసరత్తు సాగిస్తోందని పేర్కొంది.