కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో రెబల్ టీమ్ విలీనం అవుతున్నట్టు ఎంపీ కకోలి ఘోష్ ప్రకటించారు. ఎన్సీపీఐతో కలిసిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌గా ఏర్పడితే వచ్చే లీగల్ సమస్యలను తప్పించేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. రెబల్ ఎంపీలు ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి లోక్‌సభలో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
టీఎంసీలో మరో ఇద్దరు ఎంపీలు రెబల్ క్యాంపులో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీలకు నేతృత్వం వహిస్తున్న కకోలి ఘోష్ ప్రకటించారు. దీంతో తమ సంఖ్య 20 నుంచి 22కి చేరిందని కకోలి వెల్లడించారు. వారిద్దరూ తమ క్యాంపులో చేరిన తర్వాత పేర్లను ప్రకటిస్తామన్నారు. రెబల్ ఎంపీలు ఆదివారం కేంద్రమంత్రి భూపేంద్రను కలిశారు. ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు జరిగినట్టు తెలుస్తున్నది. త్వరలోనే బెంగాల్ సీఎం సువేందు అధికారిని కూడా వారు కలిసే చాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొన్నది.
టీఎంసీ రెబల్ ఎంపీలకు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఇవ్వొద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ లేఖ రాశారు. టీఎంసీ ఎప్పటికీ అవిభాజ్య పార్టీగానే ఉంటుందని.. ఎలాంటి గ్రూపులకు తావు లేదన్నారు. రెబల్ ఎంపీలు తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని స్పీకర్‌ను కలవబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. టీఎంసీలో చీలికలు ఉండబోవని.. ఒకే పార్టీ, ఒకే అధినేతగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఒకవేళ స్పీకర్ గుర్తింపు ఇచ్చినా అది చట్టపరంగా చెల్లదని అభిషేక్ స్పష్టం చేశారు.
టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మమతా బెనర్జీ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీ యూత్ వింగ్ అధ్యక్ష పదవి నుంచి జాదవ్‌పూర్ ఎంపీ సాయోనీ ఘోష్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో యూత్ లీడర్ ఆర్నబ్ బెనర్జీని నియమించారు. అలాగే విమెన్ వింగ్ అధ్యక్ష పదవి నుంచి కోల్‌కతా బదక్షిణ ఎంపీ మలా రాయ్‌ను తొలగించి ఆమె స్థానంలో కాలిగంజ్ ఎమ్మెల్యే అలిఫా అహ్మద్‌ను నియమించారు. మలారాయ్, సాయోనీ ఇద్దరూ రెబల్ ఎంపీల గ్రూప్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ కూడా ఈ గ్రూపులో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీదీ రెబల్ ఎంపీలను పార్టీ నుంచి తొలగించే చర్యలు చేపట్టింది. ఇప్పటికే రితబ్రత నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు రెబల్ గ్రూపులో చేరారు.
ముంబై: మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ ఊహాగానాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సమావేశమయ్యారు. షిండే వర్గంలోకి పలువురు ఎంపీలు ఫిరాయించనున్నారనే వార్తల వెలువడుతున్న క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మొత్తం 9 మంది ఎంపీల్లో కేవలం నలుగురు మాత్రమే ఈ భేటీకి హాజరయ్యారు. అయితే యూబీటీ నేతలు ఈ చీలిక వార్తలను వదంతులుగా కొట్టిపారేశారు. సమావేశం అనంతరం ఎంపీ అనిల్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ సమావేశానికి నలుగురు మాత్రమే హాజరయ్యారని, మిగిలిన వారు వ్యక్తిగత పనుల వల్ల ఆన్లైన్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. తాము తొమ్మిది మంది ఎంపీలం కలిసే ఉన్నామని, ఎలాంటి సమస్యా లేదని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టివేశారు.