కోల్‌కతా: ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త మరణించగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆవేశంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై బీజేపీ దాడులు చేయడమే కాకుండా పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాలకు తాళాలు వేసి తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అక్కడ పార్టీ జెండాలను ఎగుర వేశారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసకు దిగిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుల్డోజర్తో టీఎంసీ కార్యాలయం కూల్చివేత
సెంట్రల్ కోల్‌కతాలో ప్రత్యేక న్యూ మార్కెట్లో ఉన్న పలు కట్టడాలను, షాపులను అధికారులు మంగళవారం అర్ధరాత్రి బుల్డోజర్లతో కూల్చివేశారు. బీజేపీ జెండాలు ధరించిన కొందరు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ చేయించారు. దీంతో అక్కడ ఉన్న షాపుల వారు షట్టర్లు దించి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ ఉన్న టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ కార్యాలయాన్ని కూడా కూల్చివేశారు. అలాగే ముర్షిదాబాద్‌లోని జియాగంజ్‌లో లెనిన్ విగ్రహాన్ని బీజేపీ మద్దతుదారులు కొందరు ధ్వంసం చేశారు. బీజేపీ నేతలే ఈ విధ్వంసానికి పాల్పడినట్టు టీఎంసీ ఆరోపించింది. ఎన్నికల ముందు భయం పోయి నమ్మకం వచ్చింది.. ఎన్నికల తర్వాత నమ్మకం పోయింది.. బుల్డోజర్ వచ్చింది.. అని హింసపై టీఎంసీ వ్యాఖ్యానించింది. ఉద్రిక్తతలకు లోను కావద్దని బీజేపీ తన శ్రేణులకు సూచించింది.
సువేందు అధికారి పీఏ దారుణ హత్య
బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మధ్యమ్‌గ్రామ్‌లో చంద్రనాథ్ రథ్ కారులో వెళ్తుండగా ఘటన జరిగింది.