బెంగాల్ లో ఓ మహిళ సీఎం పీఠంపై ఉండగా.. ఒక్క అత్యాచారం జరిగినా.. అది రాష్ట్రానికి సిగ్గుచేటే అవుతుందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. జరుగుతున్న సంఘటనలపై అందరూ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. బెంగాల్‌లోని నదియా గ్రామంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సౌగతా రాయ్ పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించమని స్పష్టం చేశారు. నదియా లాంటి ఘటనలు జరిగితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం కచ్చితంగా నేరస్తులను కఠినంగా శిక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికను తోటి విద్యార్థులే బర్త్ డే పార్టీకి పిలిచారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమంతు కలిపి ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే సామూహికంగా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక అపస్మారక స్థితిలోనే ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించి, తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్ష చేసి చూడగా… ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.