కోల్కతా, జూన్ 26: కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీలు పశ్చిమబెంగాల్లో బీజేపీతో అపవిత్ర బంధాన్ని కొనసాగిస్తున్నాయని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని ఆరోపించారు.
కూచ్బెహర్లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడారు. విపక్ష కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీల పాత్రపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీలు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని పరోక్షంగా సహకరిస్తున్నాయని ఆరోపించారు. వారి అపవిత్ర బంధాన్ని తాను ధ్వంసం చేస్తానని చెప్పారు. బీజేపీపై పోరులో టీఎంసీ పాత్ర ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉండేదని పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరీ విమర్శించారు.