Tirupati Laddu Row | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్ నోటీసులు పంపింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపింది. ఇందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో నోటీసులు చేసింది. అయితే, తమిళనాడులో ఏఆర్ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ నివేదికలో తేలిందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయం తెలిసిందే. లడ్డూల వ్యవహారంలో ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. కల్లీ నెయ్యి అంశంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐజీపీ, అత్యకంటే ఎక్కువ ర్యాంకు అధికారులతో సిట్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని.. ఆ తర్వాత గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.